చందాలు వేసి శవపేటికలు పంపడం కాదు పరిష్కారం
అమెరికా హైవేల మీద తెలుగు పిల్లల మరణాలు, వ్యక్తిగత విషాదాల వెనుక ఒక వ్యవస్థాగత సమస్య
గత కొద్ది నెలల్లో నా కుమార్తెకు తెలిసిన ఇద్దరు యువకులు అమెరికాలో రోడ్డు ప్రమాదాల్లో మరణించారు. రెండు సందర్భాల్లోనూ జరిగింది ఒక్కటే. అక్కడి తెలుగు పిల్లలు, ఐటీ ఉద్యోగులు కలిసి చందాలు వేసుకున్నారు. పార్థివదేహాన్ని ఇండియా పంపడానికి, ఆసుపత్రి బిల్లులకు, అంత్యక్రియలకు. ఇద్దరి తల్లిదండ్రులూ నిరుపేదలు. పిల్లల చదువు కోసం అప్పులు చేసి పంపినవాళ్లు. తిరిగి వచ్చింది శవపేటిక, దానితో పాటు తీర్చాల్సిన అప్పు.
చందాలు వేసిన పిల్లల మనసుల్లో ఏముందో నాకు అర్థమవుతుంది. "ఇది నాకూ జరగవచ్చు" అనే గుర్తింపు అది. అదే హైవే మీద, అదే అలసటతో, అదే పాత కారులో, అదే ఆర్థిక ఒత్తిడితో వాళ్లూ రోజూ ప్రయాణిస్తున్నారు.
చనిపోయినవాడి స్థానంలో తనను చూసుకోవడం వల్లే ఆ ఔదార్యం. ఆ ఔదార్యాన్ని తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు. కానీ ఒక సమాజంగా మనం ఆలోచించాల్సిన ప్రశ్న. ప్రతిసారీ మరణం తర్వాత చందాలు వేసుకునే ఏర్పాటుకు మనం ఎందుకు అలవాటు పడిపోయాం? మరణాన్ని నివారించే వైపు ఆ శక్తిని ఎందుకు మళ్లించలేకపోతున్నాం?
తెలుగు విద్యార్థుల మరణాలపై అధికారిక, జాతీయత వారీ గణాంకాలు ఏ ప్రభుత్వమూ ప్రచురించడం లేదు. ఉన్నది కాన్సులేట్ ప్రకటనలు, డయాస్పోరా మీడియా వార్తలే. కానీ ఆ వార్తల వరుసే ఒక తీవ్రతను చెబుతోంది.
ఆగస్టు 7: కడప జిల్లా జెట్టివారిపల్లికి చెందిన దిలీప్ కుమార్ బుంగటవుల (26) ఒహాయోలోని ఇంటర్‌స్టేట్ 480 మీద మరణించాడు. ఎదురుగా వస్తున్న పికప్ ట్రక్ మీడియన్ దాటి అతని కారును ఢీకొట్టింది. కెంట్ స్టేట్ యూనివర్సిటీలో ఎంఎస్ పూర్తి చేసి, అప్పుడే సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరాడు. తండ్రి శ్రీహరి రైతు. కుటుంబం ఆర్థికంగా బలహీనమైనది కావడంతో నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (NATS) విరాళాల సేకరణ ప్రారంభించింది. మళ్లీ అదే కథ. మరణం, తర్వాత చందాలు.
జూలై 18: నిర్మల్ జిల్లాకు చెందిన నిత్యానంద రెడ్డి డెట్రాయిట్లో చదువు పూర్తి చేసిన కొద్ది రోజులకే బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, జూలై 23న తన పుట్టినరోజున ఆసుపత్రిలో మరణించాడు.
జూలై 14: పల్నాడు జిల్లా వినుకొండ మండలం ఉమ్మడివరం గ్రామానికి చెందిన మక్కెన ప్రసన్న (27) న్యూజెర్సీలో స్నేహితులతో ఒక కార్యక్రమం నుంచి తిరిగి వస్తుండగా కారు అదుపు తప్పి చెట్టును ఢీకొని అక్కడికక్కడే మరణించింది. ముగ్గురు పిల్లల్లో పెద్దది. ఎంఎస్ పూర్తి చేసి ఉద్యోగ వేటలో ఉంది. కుటుంబం పార్థివదేహం తరలింపు కోసం స్థానిక ఎమ్మెల్యేను, అధికారులను వేడుకోవాల్సి వచ్చింది.
జూలై 5: ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ములపాడు గ్రామానికి చెందిన ప్రసన్న అట్లూరి (25) అప్స్టేట్ న్యూయార్క్‌లో బహుళ వాహనాల ఢీకొన్న ప్రమాదంలో మరణించింది. పేస్ యూనివర్సిటీ నుంచి అప్పుడే పట్టా పుచ్చుకుంది.
మే: గుంటూరు ప్రాంతానికి చెందిన నవ్య చికాగోలో స్నేహితులతో ప్రయాణిస్తుండగా వెనుక నుంచి మరో వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించింది.
ఏప్రిల్: గుంటూరుకు చెందిన నవ్య నెలకుదితి (23) పెన్సిల్వేనియాలోని పిట్స్బర్గ్ సమీపంలో రోడ్డు ప్రమాదంలో మరణించింది.
ఈ జాబితా సంపూర్ణమైనది కాదు. వార్తల్లోకి వచ్చినవి మాత్రమే. ప్రతి పేరు వెనుక ఒక అప్పు, ఒక డ్రీమ్, ఒక చందాల లింక్ ఉంది.
ఇక్కడ ఒక నిజాయితీ అవసరం
ఈ ఘటనల్లో చాలా వాటిలో తప్పు మన పిల్లలది కాదు. దిలీప్ కారును మీడియన్ దాటి వచ్చిన ట్రక్ ఢీకొట్టింది. నవ్య కూర్చున్న కారును వెనుక నుంచి మరో వాహనం ఢీకొట్టింది. కాబట్టి "పిల్లలు జాగ్రత్తగా నడపడం లేదు" అనే సులభమైన నింద ఇక్కడ పనికిరాదు.
అసలు విషయం వేరే. ఎక్స్పోజర్. రహదారి భద్రతా శాస్త్రంలో ఒక మౌలిక సూత్రం: మీ డ్రైవింగ్ ఎంత బాగున్నా, హైవే మీద మీరు గడిపే గంటలు పెరిగేకొద్దీ ఎదుటివాడి తప్పుకు కూడా మీరు బలయ్యే అవకాశం పెరుగుతుంది. రోజూ 100 మైళ్లు తిరిగే వ్యక్తికి, 15 మైళ్లు తిరిగే వ్యక్తి కంటే ప్రమాద సంభావ్యత అనేక రెట్లు ఎక్కువ. మీడియన్ దాటి వచ్చే ట్రక్ ఎదురుపడాలంటే కూడా మీరు ఆ సమయంలో ఆ హైవే మీద ఉండాలి కదా.
మరి మన పిల్లలు హైవేల మీద ఎందుకు అంతగా ఉంటున్నారు? ఇక్కడే ఆర్థిక కోణం వస్తుంది.
అద్దె లెక్క ... ప్రాణాల లెక్క
అమెరికా నగరాల్లో అద్దెలు ఆకాశాన్ని తాకుతున్నాయి. యూనివర్సిటీ ఉన్న ఊళ్లో, ఉద్యోగం ఉన్న ఊళ్లో నెలకు 1,500-2,000 డాలర్లు అద్దె. అదే 60-80 మైళ్ల దూరంలోని చిన్న టౌన్లో సగానికి సగం. లోన్ ఈఎంఐ ఒత్తిడి, తల్లిదండ్రుల త్యాగం తీర్చాలన్న భారం మోస్తున్న పిల్లలకు ఆ ఆదా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. దాంతో ఒక ఊళ్లో నివాసం, ఇంకో ఊళ్లో పని. మధ్యలో రోజూ రెండు మూడు గంటల ఇంటర్‌స్టేట్ ప్రయాణం.
కానీ ఆ లెక్క నిజాయితీగా వేస్తే మిగిలేది తక్కువ. పెట్రోల్, కారు అరుగుదల, ఇన్సూరెన్స్ కలిపితే అమెరికాలో కారు నడపడానికి మైలుకు సుమారు 65-70 సెంట్లు ఖర్చవుతుందని అధికారిక అంచనాలు చెబుతాయి. రోజూ 100 మైళ్లు అంటే నెలకు 1,300-1,400 డాలర్లు. ఆదా అనుకున్న అద్దె దాదాపు మొత్తం రోడ్డు మీదే ఖర్చవుతోంది. దానికి అదనంగా రోజూ పోయే మూడు గంటల సమయం, నిద్ర, ఆరోగ్యం. అన్నింటికీ మించి ప్రాణాపాయ రిస్క్. ఖరీదైన ఊళ్లో నలుగురితో గది పంచుకోవడం, చౌక ఊళ్లో ఒంటరిగా ఉండి రోజూ హైవే ఎక్కడం కంటే అన్ని విధాలా మెరుగు అని ఈ లెక్క చెబుతుంది. కానీ ఈ లెక్క ఎవరూ పిల్లలకు చెప్పరు.
దీనికి తోడు మరో ప్రాణాంతక కాంబినేషన్. నైట్ షిఫ్ట్‌లు, పార్ట్‌టైమ్ పనులు ముగించుకుని తెల్లవారుజామున చేసే డ్రైవింగ్. నిద్రలేమితో వాహనం నడపడం మద్యం తాగి నడపడంతో సమానమని నిద్ర పరిశోధన ఏనాడో తేల్చింది. భారత రోడ్ల అనుభవానికి, గంటకు 75 మైళ్ల వేగంతో 18 చక్రాల ట్రక్కుల మధ్య సాగే అమెరికన్ ఇంటర్‌స్టేట్ డ్రైవింగ్‌కు మధ్య ఉన్న అంతరం; శీతాకాలంలో కంటికి కనిపించని బ్లాక్ ఐస్; ఖర్చు తగ్గించుకోవడానికి కొనే పాత కార్లు, కనీస స్థాయి ఇన్సూరెన్స్‌లు ఇవన్నీ ఆ రిస్క్‌ను రెట్టింపు చేస్తున్నాయి.
తల్లిదండ్రులు చేయగలిగింది "జాగ్రత్త నాన్నా" కాదు
రోజూ ఫోన్ చేసి జాగ్రత్త చెప్పడం వల్ల ఒరిగేది ఏమీ లేదు. పైగా డ్రైవింగ్ మధ్యలో ఫోన్ మాట్లాడే అలవాటుకు అదే దారి తీస్తుంది. నిజంగా పనిచేసేవి వేరే:
ఒకటి. పంపే ముందే ఈ మాట చెప్పండి: "కారు, ఇన్సూరెన్స్, డ్రైవింగ్ శిక్షణ .. ఈ మూడింటికీ డబ్బు అడగడానికి మొహమాటపడకు. ఇది చదువు ఖర్చులో భాగమే." పిల్లలు 3,000 డాలర్ల పాత కారు కొనడానికి, కనీస ఇన్సూరెన్స్‌తో సరిపెట్టుకోవడానికి, ప్రొఫెషనల్ హైవే డ్రైవింగ్ లెసన్స్ (300-400 డాలర్లు) మానుకోవడానికి కారణం... మీ మీద భారం వేయకూడదన్న సంకోచమే. ఆ సంకోచాన్ని మీరే తొలగించాలి. అమెరికా ఖర్చుల్లో ఆదా చేయకూడని ఏకైక అంశం ఇది.
రెండు... "పని ఎలా ఉంది" కాదు, "రోజు ఎలా గడుస్తోంది" అని అడగండి: ఎన్ని గంటలు నిద్ర, ఎన్ని మైళ్ల ప్రయాణం, ఏ సమయంలో డ్రైవింగ్. నైట్ షిఫ్ట్ + గంటన్నర కమ్యూట్ + నాలుగు గంటల నిద్ర. ఈ పాటర్న్ కనిపిస్తే "జాగ్రత్త" అనకండి. "ఆ ఊరికి మారడానికి అదనంగా అయ్యే అద్దె మేము చూసుకుంటాం" అనండి. అది భావోద్వేగ మాట కాదు . రిస్క్ తగ్గించే ఆచరణాత్మక జోక్యం.
మూడు.. అప్పు ఒత్తిడిని రోడ్డు మీదకు పంపకండి: "లోన్ ఒక సంవత్సరం ఆలస్యంగా తీరినా ఫర్వాలేదు, నువ్వు క్షేమంగా ఉండటమే ముఖ్యం" అని స్పష్టంగా చెప్పండి. ఆ మాట చెప్పకపోతే పిల్లలు రెండు ఉద్యోగాలు, ప్రమాదకర కమ్యూట్లు, నిద్రలేమి.. అన్నింటినీ మౌనంగా భరిస్తూ ఆ ఒత్తిడిని హైవే మీదకు తీసుకెళ్తారు.
నాలుగు... ఎమర్జెన్సీ సమాచారం మీ దగ్గర ఉండాలి: పిల్లల రూమ్మేట్ నంబర్, ఆ ప్రాంతపు తెలుగు అసోసియేషన్ కాంటాక్ట్, సంబంధిత ఇండియన్ కాన్సులేట్ ఎమర్జెన్సీ నంబర్. ఏదైనా జరిగినప్పుడు మొదటి 24 గంటల్లో సమాచారం కోసం వాట్సాప్ గ్రూపుల మీద ఆధారపడే దుస్థితి ఏ కుటుంబానికీ రాకూడదు.
పిల్లలు చేయగలిగింది
ఉద్యోగం ఎంపికలోనే దూరాన్ని పరిగణించడం; వారానికి ఐదు రోజులు 500 మైళ్లు తిరిగే ఏర్పాటు దీర్ఘకాలం నడవదని గుర్తించడం. నైట్ షిఫ్ట్ తర్వాత కనీసం అరగంట నిద్రపోయి బయలుదేరడం. ఇది నామోషీ కాదు. కారు కొనేటప్పుడు ధర ఒక్కటే కాకుండా సేఫ్టీ రేటింగ్ చూడటం. 3,000-4,000 డాలర్ల బడ్జెట్లోనే మంచి రేటింగ్ ఉన్న పాత టయోటా/హోండా మోడల్స్ దొరుకుతాయి; కొనే ముందు 100-150 డాలర్ల మెకానిక్ ఇన్స్పెక్షన్ తప్పనిసరి. ఇన్సూరెన్స్‌లో Uninsured Motorist, Medical Payments కవరేజ్‌లు అదనంగా తీసుకోవడం. నెలకు కొద్ది డాలర్ల ఖర్చే కానీ, ఇన్సూరెన్స్ లేని డ్రైవర్ ఢీకొట్టినప్పుడు కుటుంబాన్ని లక్షల డాలర్ల ఆసుపత్రి బిల్లుల నుంచి కాపాడుతుంది. మంచు రాష్ట్రాల్లో ఉంటే మొదటి శీతాకాలంలోనే ఖాళీ పార్కింగ్ లాట్లో స్కిడ్ రికవరీ ప్రాక్టీస్ చేయడం.
అసలు ప్రశ్న. సంఘాలు, ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి?
ఇప్పుడు మొదటి ప్రశ్నకు తిరిగి వద్దాం. ప్రతి మరణం తర్వాత చందాలు. TANA, NATS, NATA వంటి తెలుగు సంఘాలు పార్థివదేహాల తరలింపునకు నిధులు సేకరించడంలో చురుగ్గా ఉంటాయి . దిలీప్ కుటుంబానికి NATS చేస్తున్నది అదే. ఆ సాయం విలువైనదే. కానీ కోట్ల రూపాయల వార్షిక బడ్జెట్లు, వేల మంది సభ్యులు ఉన్న ఈ సంఘాల శక్తి దాదాపు పూర్తిగా మరణానంతర సాయానికే పరిమితం కావడం ఒక వైఫల్యం.
అదే శక్తితో చేయగలిగినవి: కొత్తగా వచ్చే ప్రతి విద్యార్థికి హైవే డ్రైవింగ్ ఓరియంటేషన్; యూనివర్సిటీ నగరాల్లో కార్‌పూల్ నెట్‌వర్క్‌లు; సబ్సిడీతో డ్రైవింగ్ లెసన్స్; వాడిన కారు కొనేటప్పుడు తనిఖీ చేయించే వాలంటీర్ మెకానిక్ నెట్వర్క్; ఒక శాశ్వత ఎమర్జెన్సీ ఫండ్. ప్రతిసారీ కొత్తగా చందాల లింక్ తిప్పకుండా. మరణించిన తర్వాత లక్ష డాలర్లు సేకరించే సమాజం, బతికుండగా 400 డాలర్ల డ్రైవింగ్ శిక్షణ ఇప్పించలేదా?
తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలదీ ఇదే తీరు. ప్రతి మరణం తర్వాత సంతాప ప్రకటన, పార్థివదేహం తరలింపునకు "అన్ని విధాలా సాయం" హామీ. కానీ ఏటా వేల మంది పిల్లలను అమెరికా పంపుతున్న రాష్ట్రాలు... వెళ్లే ముందు వారికి అక్కడి రోడ్డు వాస్తవాలపై ఒక్క ఓరియంటేషన్ కార్యక్రమమైనా నిర్వహిస్తున్నాయా? విదేశాలకు వెళ్లే విద్యార్థుల డేటా, అక్కడ జరుగుతున్న మరణాల డేటా క్రమపద్ధతిలో సేకరిస్తున్నాయా? లేదు. డేటా లేకపోవడం యాదృచ్ఛికం కాదు. డేటా ఉంటే జవాబుదారీతనం అడగవచ్చు.
చందాలు వేసుకునే పిల్లల ఔదార్యం మీద ఆధారపడి నడిచే వ్యవస్థ, వ్యవస్థే కాదు. ఆ ఔదార్యం మరణానంతర సాయం నుంచి మరణ నివారణ వైపు మళ్లినప్పుడే, పంపే ముందు తల్లిదండ్రులు, వెళ్లాక పిల్లలు, అక్కడ సంఘాలు, ఇక్కడ ప్రభుత్వాలు ఎవరి బాధ్యత వారు గుర్తించినప్పుడే.. ఈ శవపేటికల వరుస ఆగుతుంది.